Saturday, March 21, 2009

controversy Daggubat venkateswarao


ఇంటి గుట్టు లంకకు చేటు అని సామెత. ఇప్పుడు ఆ సామెత ఎన్.టి.ఆర్ కుటుంబానికి బాగా అతుకుతుంది. ఎన్.టిఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయాన తన బావమరిదికి ఒక లేఖ రాసి ఎన్.టి.ఆర్. పదవీచ్యుతుడయ్యాక తన బిడ్డవైతే చంద్రబాబును కత్తితో పొడిచి రమ్మని బాలకృష్ణకు చెప్పారంటూ, అదే విషయాన్ని ఆయన ఓ లేఖ ద్వారా బావ మరిదికి గుర్తు చేయడం సంచలనం అయింది. ఆ లేఖను కొన్ని పత్రికలు పతాకశీర్షికలలో ప్రచురించాయి. పదమూడు సంవత్సరాల క్రితం ఎన్.టి.ఆర్ దివంగతుడైనప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సమయంలో జరిగిన వ్యవహారాలు చర్చ అవుతున్నాయి. ఒకప్పుడు ఎన్.టి.ఆర్ కుమారులెవ్వరూ రాజకీయాలలోకి రావడానికి, జోక్యం చేసుకోవడానికి సాహసించేవారు కారు. అదే సమయంలో అల్లుళ్ల ప్రమేయం అధికంగా ఉండేది. ఇద్దరు అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబునాయుడు చెరో వర్గానికి నాయకత్వం వహించేవారు. 1994 వరకు కూడా దగ్గుబాటి ఏ మాత్రం తగ్గకుండా చంద్రబాబుతో పోటీపడేవారు. అయితే వ్యూహాలు రూపొందించడంలోకాని, అమలు పరచడంలోకాని చంద్రబాబుకు దగ్గుబాటి ధీటు కాదని అంగీకరించాల్సిందే. ఉదాహరణకు దగ్గుబాటి తనకు కావల్సినవారికి టిక్కెట్లు, ఇప్పించుకోవడానికి నేరుగా ఎన్.టి.ఆర్ తోనో, లేక లక్ష్మీపార్వతితోనో మాట్లాడి సెటిల్ చేసుకునేవారు. కాని చంద్రబాబు నేరుగా మాట్లాడే వ్యూహంతోపాటు పరోక్ష వ్యూహాన్ని కూడా అమలు చేసేవారు. తన వర్గం అంటే టిక్కెటో రాదోమోనన్నఅనుమానం ఉన్న కొందరిని తనతో సంబంధం లేనట్లుగా లక్ష్మీపార్వతి వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడుకుని ఎన్.టి.ఆర్ కు సిఫారస్ చేయించుకోమని సలహా ఇచ్చేవారని అంటారు. కొందరి విషయంలో ఆ వ్యూహం ఫలించిందనే అంటారు. అయితే అప్పటికి దగ్గుబాటి ఎమ్.పిగా ఉండేవారు. అందువల్ల ఆయన ఎన్నికలలో పోటీచేయలేదు. అది కూడా ఆయనకు నష్టం చేసింది. అదే సమయంలో చంద్రబాబు కుప్పం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పైగా ఎన్.టి.ఆర్ క్యాబినెట్ లో కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖలను ఆయనకు అప్పగించారు. క్యాబినెట్ రూపొందే సమయంలో అనేక మంది ఎన్.ట్.ఆర్ ఇంటి వద్ద తచ్చాడుతుండేవారు. ఆ రోజుల్లో లక్ష్మీపార్వతి దర్శనం అయితే అదే మహద్బాగ్యం అన్నట్లుగా నాయకులు వ్యవహరించేవారు. అంతదాకా ఎందుకు తనకు రంగారెడ్డి జిల్లాల్లో ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో చెప్పడానికి స్వయంగా దేవేందర్ గౌడ్ బంజారాహిల్స్ లోని ఎన్.టి.ఆర్. నివాసం వద్ద లక్ష్మీపార్వతిని కలుసుకోవడానికి చాలసేపు వేచి ఉన్న సందర్భం కూడా ఉందంటే ఇప్పుడు నమ్మకం లేకపోవచ్చు. ఆయన ఒక్కరన్నమాటేమిటి. అనేకమంది అలానే చేశారు. అశోక్ గజపతి రాజు వంటి కొద్దిమందిని మినహాయించాలి. కొన్నిసార్లు లక్ష్మీపార్వతి అతిగా జోక్యం చేసుకోవడం పై బాగా విమర్శలు వచ్చేవి. ఒక్కోసారి ఎన్.టి.ఆర్ కూడా బాగా ఆగ్రహం చెందేవారని అంటారు. కాని పరిస్థితులు ఆయనకు కలిసిరాలేదు. ఒకపక్క చంద్రబాబు, మరో పక్క దగ్గుబాటి, వేరొకవైపు లక్ష్మిపార్వతి అధికార తాపత్రయం ఇవన్ని వెరసి ఎన్.టి.ఆర్ కు నిత్యం చికాకుగా ఉండేవి. పైగా పత్రికలలో ఇవే ప్రధాన వార్తలుగా వచ్చేవి. కొన్నిసార్లు ఎన్.టి.ఆర్ కూడా ఆ పత్రికలపై తీవ్ర అసంతృప్తి చెందేవారు కాని పైకి అనేవారు కారు. అప్పటికే ఒక అనుమానం ఏర్పడింది. అప్పటికే చంద్రబాబు, లక్ష్మిపార్వతి వర్గాల మధ్య పోరు తీవ్రం అయింది. విశ్లేషకులకు 1996 పార్లమెంటు ఎన్నికలలోగా ఎన్.టి.ఆర్ ను దించడం జరుగుతుందని అనుకునేవారు. కాని ఊహించినదానికన్నా ముందుగానే పరిణామాలు తోసుకువచ్చేవి. అయితే అప్పటికే చంద్రబాబు చాలా చతురతతో తానే ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని రక్షిస్తున్నానన్నచందంగా వార్తలు వచ్చేలా జాగ్రత్తపడేవారు. ఎన్.టి.ఆర్ ప్రభుత్వంలో జరిగే కొన్ని నిర్ణయాలపై ఆయన తెలివిగా వాటిని మార్చడానికి యత్నిస్తున్నట్లు కనబడేవారు. ఒకసారి డిస్టిలరీల కెపాసిటి పెంచుతూ ఎన్.టి.ఆర్ ఫైల్ పై సంతకం చేసి, ఆ తర్వాత ఆయన లండన్ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత అది వార్తలలో వచ్చింది. తదుపరి పరిస్థితి అంతా గందరగోళంగా మారినట్లు, దానిని చంద్రబాబు చక్కదిద్దుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రొజెక్షన్ వచ్చేది. వాటిలో కొన్ని నిజాలు కూడా ఉండవచ్చు. కొంత వ్యూహం ఉండవచ్చు. ఇక ప్రజల వద్దకు ప్రభుత్వం పేరుతో ఎన్.టి.ఆర్ కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ వివాదాలు బాగా ముదిరిపోయాయి. లక్ష్మీపార్వతి వర్గంగా ఉన్న మంత్రులంతా చంద్రబాబు తదితరులంతా ఎన్.టి.ఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారని బహిరంగంగాను ఆరోపించేవారు. అయితే ఎన్.టి.ఆర్ దానిని నమ్మేవారు కారు లక్ష్మీపార్వతి, చంద్రబాబులు పరస్పరం తగాదా పడతారేకాని, తనను దించేవరకు పరిస్థితి వెళుతుందని భావించేవారుకారు. అలా అనుకుంటే ముందుగానే చంద్రబాబుతో సహ మరో నలుగురైదుగురిని తొలగించి, మరికొందరిని మంత్రి పదవువలలోకి తీసుకునేవారు. అప్పుడు పరిణామాలు మరోరకంగా ఉండేవేమో. ఈ క్రమంలోనే చంద్రబాబుతో దగ్గుబాటి చేతులు కలవడం. దగ్గుబాటికి కూడా లక్ష్మీపార్వతి వైఖరి నచ్చేదికాదు. అలాగని చంద్రబాబుతో సరిపడేదికాదు. కాని రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా? ఆ ప్రకారం చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ప్రకారం తాను ఉప ముఖ్యమంత్రి అవుతానని దగ్గుబాటి అనుకున్నారు. అలాగే చంద్రబాబు హరికృష్ణను కూడా తనవైపు తిప్పుకోవడంలో సఫలం అయ్యారు. అంతేకాక, అప్పటికే హరికృష్ణ ఆయా ప్రాంతాలలో పర్యటించి లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చారు. లక్ష్మీపార్వతి రాజకీయంగా తప్పు చేసిందా? లేక సరిగా వ్యవహరించిందా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఆమె అధికారం కోసం తొందరపడిందన్నది వాస్తవం. ఎందు కంటే రవీంద్రభారతిలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో ఆనాటి మంత్రి దాడి వీరభద్రరావు ఈమెను ఉద్దేశించి భావి ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడం, ఎన్.టి.ఆర్ కూడా సంతోషంగా అదే తరహా ఉపన్యాసం చేయడం వివాదాస్పదం అయింది. అయితే చంద్రబాబు వ్యూహాల ముందు లక్ష్మీపార్వతి దెబ్బతినిపొయింది. అంతేకాక చంద్రబాబు దౌత్యం పేరుతో ఎస్.వి సుబ్బారెడ్డి, అశోక్ గజపతి రాజు, దేవేందర్ గౌడ్ లను ఎన్ టి ఆర్ ఇంటికి పంపడం, ఆయన ఆగ్రహం చెందడం. తరువాత వీరంతా వైస్రాయి హోటల్ లో క్యాంప్ పెట్టడం జరిగి పోయాయి. మరుసటి రోజుకు పరిస్థితి అర్థం అయి ఎన్ టి ఆర్, లక్ష్మి పార్వతి సమేతంగా అక్కడికి వెళ్లినా ఘర్షణ వాతావరణం, చెప్పులు విసురుకోవడం వంటివి జరిగాయి తప్ప ఫలితం లేక పోయింది. ఆ తర్వాత అధికార బదలాయింపు కూడా పూర్తి అయిపోయింది. కాని అంతలోనే కథ అడ్డం తిరిగింది. హరికృష్ణను క్యాబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు అంతా ఒకే కుటుంబం వారన్న విమర్శ వస్తుందన్న కారణంగా దగ్గుబాటికి పదవి ఇవ్వలేదు. దాంతోనే నిరాశకు గురైన దగ్గుబాటి పదిహేను రోజుల్లోనే తిరిగి ఎన్ టిఆర్ గూటికి తనతో పాటు వచ్చిన ఓ 15 మందితో కలిసి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే పురంధరేశ్వరి ఆనాటి తిరుగుబాటుకు సహకరించారా లేదా అన్నది ప్రశ్న. పురంధరేశ్వరి తండ్రిపై తిరుగుబాటును సమర్ధించిందని చెప్పలేకపోయినా, ఆమెకు జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు. ఎందుకంటే స్వయంగా చంద్రబాబే తిరుగుబాటు రోజు మధ్యాహ్నం దగ్గుబాటి ఇంటికి వెళ్లడం, అక్కడకు ఆనాడు పోలీసు అధికారిగా కీలక స్థానంలో ఉన్న దొర, జయప్రకాశ్ నారాయణలు వచ్చివెళ్లడం జరిగాయి. ఏదేమైనా ఇప్పుడు పురంధరేశ్వరి తిరుగుబాటుకు మద్దతు ఇచ్చారా లేదా అన్నది పెద్ద చర్చనీయాంశం కాదు. ఇక బాలకృష్ణ అటు బావల దగ్గరికి, ఇటు ఎన్ టిఆర్ ఇంటికి తిరుగుతూ కన్పించేవారు. ఇక ఎన్ టిఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామక్రమంలో లక్ష్మీపార్వతి టిక్కెట్ మీదే దగ్గుబాటి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో అది కూడా వివాదస్పదం అయింది. అది వేరే విషయం అంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడం ఎవరి దారిన వారు ప్రచారం చేయడం, లక్ష్మీ పార్వతికి వ్యూహం, ఇతరత్రా వనరులు కొరవడడం వంటి కారణాల రిత్యా జనం వచ్చినా సీట్లు రాలేదు. స్వయానా ఎన్ టిఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ, లక్ష్మీ పార్వతి పక్షాన పోటీ చేసి ఓడిపోయారు.
తదుపరి దగ్గుబాటి అక్కడనుంచి బిజేపీలోకి ప్రవేశించారు. కొన్నాళ్లు ఆర్ ఎస్ ఎస్ క్యాంపులో కూడా ఉండి వచ్చేవారు. ఈ సమయంలో టిడిపిలో మరో పరిణామం జరిగింది. శాసనసభ్యుడిగా లేనప్పుడు హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వగా, ఆరు నెలలు లోపు శాసనసభకు ఎన్నిక కాలేకపోవడంతో పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఎన్ టిఆర్ మరణంతో ఏర్పడిన ఖాళీకి హరికృష్ణ పోటీచేసి గెలిచినా మంత్రి పదవి రాలేదు. ఇదే విచిత్రమైన పరిస్థితి. ఈ అసంతృప్తితో ఉన్న హరికృష్ణ టిడిపిని వీడి అన్న టిడిపి పేరుతో సొంత కుంపటి పెట్టుకుంటే స్వయంగా పురంధరేశ్వరి వెళ్లి పూజ చేసి వచ్చారు. దగ్గుబాటి దగ్గర ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఆ సమయంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఎన్ టిఆర్ పైనుంచి ఇలా నడిపించారని విచిత్రమైన సమాధానం ఇచ్చేవారు. ఈ లోగా చంద్రబాబు బాగా నిలదొక్కొని తెలుగుదేశం పార్టీ అసలు వారసుడు ఆయనే అన్న అభిప్రాయం ప్రజలకు, లేదా టిడిపి శ్రేణులలో కలిగించడంలో సఫలీకృతం అయ్యారు. దాని ఫలితంగా హరికృష్ణ ఆయనను ఏమీ చేయలేకపోయారు. ఒక దశలో ఎన్ టిఆర్ బొమ్మలు లేకుండానే తాను టిడిపిని గెలిపించగలనన్న విశ్వాసానికి చంద్రబాబు వచ్చారు.
కాని క్యాడరు మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తన వైఖరిని మార్చుకున్న మాట నిజమే. 1999లో చంద్రబాబు తిరిగి గెలుపొందడంతో ఎన్ టిఆర్ కుటుంబంలో పునరాలోచన కూడా ఏర్పడింది. దగ్గుబాటి టిడిపితో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించకపోలేదు. ముందుగా బిజేపీతో టిడిపికి సఖ్యత కుదర్చడానికి స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళితే ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. అంతేకాక చంద్రబాబు అప్పట్లో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అనంతరం ఆయనే బిజేపీతో చేతులు కలిపారు. అది వేరే విషయం. అలాగే టిడిపిలో చేరడానికి కూడా రాయబారాలు జరిపారు. కాని చంద్రబాబు అంగీకరించలేదు. ఆ క్రమంలో 2004 వచ్చేనాటికి దగ్గుబాటికి పట్టుదల పెరిగింది. కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కాని అక్కడ పర్చూరు టిక్కెట్ సంపాదించుకోవడం కష్టంగా మారింది. సరిగ్గా అప్పుడు తురుపు ముక్క మాదిరి ఎన్ టిఆర్ కుమార్తె పురంధరేశ్వరిని రాజకీయ రంగప్రవేశం చేయడం ద్వారా రెండు రకాలుగా ప్రయోజనాలు పొందవచ్చని ఆయన భావించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు కూడా ఇది మంచి వ్యూహంగానే అనిపించింది. ఆ వెంటనే వీరిద్దరు కాంగ్రెస్ లో చేరిపోవడం, ఎన్నికల్లో గెలవడం, అనంతరం కేంద్రమంత్రి పదవిని కూడా పురంధరేశ్వరి దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చనడానికి ఇదో ప్రత్యక్ష నిదర్శనం. ఆ తర్వాత అప్పుడప్పుడు చంద్రబాబు, పురంధరేశ్వరి మధ్య మాటల తూటాలు పేలాయి. నిజానికి ఇరు కుటుంబాల మధ్య దాదాపు మాటలు కూడా లేని పరిస్థితి అంటే ఆశ్చర్యం కాదు. బాలకృష్ణ ఇంటిలో కాల్పుల ఘటన జరిగినప్పుడు దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో ఉండడం బాగా ఉపయోగపడింది. అందువల్లే దగ్గుబాటి శాంతి భద్రతల గురించి ప్రస్తావించి ముందు మనింట్లో ఏమి జరిగిందో గుర్తుంచుకో అని లేఖలో రాశారు. అలాగే ఎన్ టిఆర్ అప్పట్లో చంద్రబాబును కత్తితో పొడిచి ఆ రక్తంతో ఉన్న కత్తిని తనకు చూపమన్నారని దగ్గుబాటి ఇప్పుడు చెప్పడం కొత్తగానే ఉంది. ఎన్ టి ఆర్ ఆ రోజుల్లో చంద్రబాబును తీవ్రంగా విమర్శించడంకాదు... దూషించారు. అది వాస్తవమే కాని ఇప్పుడు బయటపెట్టవలసిన అవసరం ఉందా అన్నది కూడా ప్రశ్నే. కారంచేడులో తన ఇంటిముందుకొచ్చి తొడగొట్టి, మీసం మెలివేయడం దగ్గుబాటికి కోపం తెప్పించి ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి కూడా ఇదొక అవకాశంగా దగ్గుబాటి భావించి ఉండవచ్చు. అయితే దగ్గుబాటి ఈ మధ్యకాలంలో వేదాంతం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. మనం నిమిత్తమాత్రులం అన్న ధోరణితో రాజకీయం నడుపుతున్నట్లున్నారు. నిజంగానే నిమిత్తమాత్రంగానే ఉంటే ఇంత వివాదం సృష్టిస్తారా అన్న సంశయం రావచ్చు. ఏది ఏమైనా రాజకీయం చాలా కఠినమైనది. దానికి దయ, దాక్షిణ్యం ఉండవు.

No comments: